Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

Naga Babu

Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా తన సోదరుడు, పార్టీ నేత కొణిదెల నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ప్రస్తుతం నాగబాబు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

 

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఈనెల 20న పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. కూటమి పొత్తులో భాగంగా ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు పేరును ప్రకటిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నామినేషన్ కు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో పవన్ కల్యాణ్ నాగబాబు పేరును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.