3 రాజధానుల రగడ : జగన్ మైండ్ గేమ్.. ఇరకాటంలో పవన్ కళ్యాణ్

అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ

  • Publish Date - January 12, 2020 / 01:14 AM IST

అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ

అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ తీర్మానం చేసింది. ఎటొచ్చి క్లారిటీ లేనిది జనసేన నుంచే. పేరుకైతే రైతులకు మద్దతుగా పవన్‌ ఉన్నాడు గాని.. మూడు రాజధానులు వద్దు అంటున్నారా, మద్దతిస్తున్నారా అన్నదే క్లారిటీ లేదు.

అమరావతి అంశం ఇప్పుడు పూర్తి పొలిటికల్‌ అయిపోయింది. రైతులకు మద్దతుగా ఉంటారా ఉండరా. ఈ ఒక్క ఆప్షనే నడుస్తోంది. అధికార పార్టీ కాబట్టి తప్పదు. స్వయంగా సీఎం ప్రతిపాదించారు కాబట్టి.. ఒప్పుకోవాల్సిందే. ఎటొచ్చి.. టీడీపీ, బీజేపీ, జనసేనకే ప్రాబ్లమ్‌. మూడు రాజధానులు వద్దు అంటే ఉత్తరాంధ్రలో కొంత పట్టు కోల్పోవాల్సి ఉంటుంది. అలాగని మద్దతు ఇస్తే ఉత్తరాంధ్ర మినహా మిగతా ప్రాంతాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుంది. పైగా టీడీపీకి ప్రాణ సంకటం లాంటి సమస్య ఇది. ఇప్పటికే, టీడీపీలో చీలిక వచ్చేసింది కూడా. విశాఖ టీడీపీ నేతలంతా పరిపాలన రాజధాని కాన్సెప్ట్‌కు ఓకే చెప్పేశారు. విడిగా మీటింగ్‌ పెట్టుకుని మరీ సీఎం ప్రతిపాదనకు జై కొట్టారు. అయినప్పటికీ, టీడీపీ స్టాండ్‌ చాలా స్పష్టం. మూడు రాజధానులు వద్దే వద్దు అని తేల్చి చెప్తున్నారు అధినేత చంద్రబాబు. రాజధాని అంటే అందులోనే అన్నీ ఉండాలని చాలా స్పష్టంగా చెబుతోంది. 

చంద్రబాబు అమరావతి నుంచి రాజమహేంద్రవరం మీదుగా తిరుపతి వరకు వెళ్లి జోలె పట్టుకుని మరీ ఇదే విషయం చెబుతున్నారు. వైసీపీ నేతలకు విశాఖ భూములపై ప్రేమ తప్ప విశాఖ నగరంపై కాదని పెద్ద స్టేట్‌ మెంటే ఇచ్చారు. రేప్పొద్దున విశాఖ లేదా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లినా ఇదే చెబుతారు. సో, మూడు రాజధానుల విషయంలో అధినేత చెప్పిందే ఫైనల్‌ కాబట్టి.. పూర్తిస్తాయి రాజధాని అమరావతిలోనే ఉండాలన్న టీడీపీ నిర్ణయంలో క్లారిటీ వచ్చింది.

ఇకపోతే బీజేపీ. రెండు పెద్ద పార్టీల మధ్య ఇప్పుడిప్పుడే ఓ చిన్న అవకాశాన్ని వెతుక్కుంటోంది. ఇలాంటి టైమ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏం మాట్లాడినా కష్టమే. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు ఓ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయంటే విశాఖ నుంచే. ఇప్పుడు పరిపాలన రాజధానిగా విశాఖను వద్దు అంటే ఉత్తరాంధ్రలో అసలుకే ఎసరు వస్తుందా అన్న భయం నిన్నటి వరకు ఉంది. మొన్నటి వరకు కర్నూలులో హైకోర్టు పెట్టాలనే డిమాండ్‌ చేసింది బీజేపీ. దానికి తగ్గట్టే సీఎం ప్రతిపాదన చేశారు. కాకపోతే, రాజధానిని విశాఖలో పెట్టడమే నచ్చలేదు. అందుకే, అటు ఇటు ఉండడం ఎందుకని… ఓ మీటింగ్‌ పెట్టుకుని రాజధాని అమరావతిలోనే ఉండాలని తీర్మానం కూడా చేశారు. జీవీఎల్‌ లాంటి నేతలు మనకెందుకు అన్నప్పటికీ బీజేపీ స్టాండ్‌ ఇదీ అని తేల్చి చెప్పేశారు. ఇక మిగిలింది జనసేన.

అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి దిగారు పవన్‌. మూడు రాజధానుల ప్రతిపాదన తరువాత రెండుసార్లు రాజధాని ప్రాంతానికి వచ్చారు. రైతులకు అన్యాయం జరిగిందనడంలో మరో మాట లేదన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు సరైన న్యాయం జరగాలి అంటున్నారు. కాని, మూడు రాజధానులపై పార్టీ నిర్ణయం ఏంటన్నది మాత్రం చెప్పలేదు. విశాఖకు రాజధాని తరలింపు వద్దు అంటే.. ఉత్తరాంధ్రలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న అనుమానాలు. అలాగని మూడు రాజధానులకు సపోర్టు చేస్తే.. ఉత్తరాంధ్ర మినహా అన్ని ప్రాంతాల్లో పార్టీ దెబ్బ తింటుంది. జనసేన నాయకులు మాత్రం మూడు రాజధానుల కాన్సెప్ట్‌ వద్దు అంటున్నారు. ప్రస్తుతం జనసేన తీరు చూస్తుంటే మూడు రాజధానులు వద్దు అనే స్టాండే వినిపిస్తోంది. కాకపోతే, సేనాపతి నుంచి ఆ మాట రాలేదు. మరి, అమరావతిపై పవన్‌ ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి.

* అమరావతిపై మరోమాట లేదంటున్న టీడీపీ
* మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటున్న చంద్రబాబు
* అమరావతిపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ 
* రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ తీర్మానం 
* ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని జనసేన 
* రైతులకు న్యాయం జరగాలంటూ పోరాటానికి మద్దతు
* టీడీపీ, బీజేపీ, జనసేనకే ప్రాబ్లమ్‌
* వద్దు అంటే ఉత్తరాంధ్రలో నష్టం
* మద్దతిస్తే మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత

Also Read : అల.. వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ