రాజకీయాల్లో మెరుపు తీగ పవన్ కళ్యాణ్

  • Publish Date - February 7, 2020 / 03:42 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అంటే.. అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లో మెరుపు తీగనే గుర్తు చేస్తున్నారు జనాలు. కొన్నాళ్లు సినిమాల్లో కనిపించకుండా గ్యాప్‌ తీసుకుంటే.. కొన్నాళ్లు రాజకీయాల్లో కనిపించకుండా పోతుంటారని అంటున్నారు. ఇక సినిమాలు చేయనని, పూర్తి స్థాయిలో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోనే ఉంటానని చెప్పిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. అది ఆయన అవసరం కాబట్టి చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే.. పవన్‌కల్యాణ్‌ ఏ కార్యక్రమం చేపట్టినా అలా మెరుపులా మెరిసి మాయం అయిపోతారని జనాలు అనుకుంటున్నారు. రాజకీయ పరంగా ఆయన ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారో.. ఎప్పుడు సైలెంట్‌ అయిపోతారో ఎవరికీ అర్థం కాదు.

ప్రజల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు దాని అంతు చూసే వరకూ ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ఇది రాజకీయాల్లో బేసిక్‌ సూత్రం. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని పార్టీ కేడరే అంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం.. కొద్ది రోజులు హడావుడి చేయడం.. ఆ తర్వాత దాని సంగతి పట్టించుకోకుండా వదిలేయడం… ఇదే ఆయనకు అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. ఇందుకు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే రాయొచ్చని జనాలు సెటైర్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక… ఏపీలో ఇసుక కొరత తీవ్రమైంది. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకుండా పోయింది. నిర్మాణాలు మొత్తం నిలిచిపోయాయి. 

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… విశాఖ వేదికగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. వేల మంది ఆయన వెంట నడిచారు. ప్రతిపక్ష టీడీపీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది. కార్యక్రమం పెద్ద సక్సెస్‌ అయ్యిందని అనుకున్నారు. అంతే ఆ తర్వాత ఇసుక కొరత గురించి పట్టించుకోవడం మానేశారు పవన్‌ కల్యాణ్‌. లాంగ్‌ మార్చ్‌ తర్వాత ఒకటి రెండు రోజు ట్వీట్లతో ఘాటైన విమర్శలు చేశారు. అంతే ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇంతలో ఇంగ్లీషు మీడియం బోధన అంటూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దానిని పట్టుకున్నారు. ఈ విషయంపై ట్వీట్ల వార్‌ చేశారు. మళ్లీ మరోసారి తనకు అలవాటైన పద్ధతిలో అదీ వదిలేశారని అంటున్నారు జనాలు.

ఇప్పుడు రాజధాని అంశం తెరవైకి వచ్చింది. ఈ విషయాన్ని అంతు తేల్చే దాకా విడిచిపెట్టనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేస్తానన్నారు పవన్‌ కల్యాణ్‌. సీఎం జగన్‌ సంగతి ఢిల్లీలోనే సెటిల్‌ చేసేస్తానని ఆవేశంగా మాట్లాడేశారు. అమరావతి గ్రామాలకు రెండు సార్లు వెళ్లారు. ఒకసారి హడావుడి చేశారు. రోడ్ల మీద బైఠాయించారు. పవన్‌ ఎంటర్‌ అయ్యాక నిజానికి ఉద్యమం మంచి ఊపందుకుంది. కానీ, కొనసాగింపు లేకుండా పోయింది.

రెండోసారి వెళ్లినప్పుడు మధ్యలోనే ఢిల్లీ నుంచి కాల్‌ వచ్చిందంటూ వెనుదిరిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చారు. ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టారు. కలసి సాగుతాం.. అమరావతి రైతులకు న్యాయం చేస్తామన్నారు. అంతే ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు పవన్‌. అధికారికంగా ప్రకటించకపోయినా పదో తేదీన అక్కడకు వెళ్తారనేది సమాచారం. 

మళ్లీ అమరావతి గ్రామాల్లో పవన్‌ కల్యాణ్‌ ఆవేశంగా నాలుగు ముక్కలు మాట్లాడి వచ్చేస్తారు. సినిమాలు చేసుకుంటారు. వీలైతే అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తారని జనాలు అంటున్నారు. ఇలా కంటిన్యూయిటీ లేని పోరాటాల వల్ల ప్రయోజనం ఉండదని జనసేన కార్యకర్తలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అంత ఇమేజ్‌ ఉండి… ప్రజలను కదిలించే శక్తి ఉన్నా.. ఇలా ప్రణాళికలు లేని పోరాటాల వల్ల ఇమేజ్‌ దెబ్బతింటోందే తప్ప పార్టీకి ప్రయోజనం కలగడం లేదని అనుకుంటున్నారు. చూడాలి… ఈసారైనా పోరాటాన్ని కొనసాగిస్తారో లేదో?