Pawan kalyan
Pawan Kalyan : గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉదయాన్నే దేవాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అనంతరం దశావతార వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో పవన్ కల్యాణ్ మాలధారణ స్వీకరించారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ చేయనున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి లడ్డూకి 300 ఏళ్ల చరిత్ర ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడానికో.. రాజకీయ లబ్ధికోసమో కాదు. వైసీపీ హయాంలో స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు వసూలు చేశారు. 10వేలు వసూల్ చేసి రశీదు 500కి ఇచ్చేవారు. వైసీపీ పాలనలో 200కుపైగా దేవాలయాలు ధ్వంసం చేశారు. రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో రథం తగులపెట్టేశారు. అప్పుడు కూడా నా ఆవేదన వ్యక్తం చేశాను. తిరుమలలో ప్రసాదాలు కల్తీ జరుగుతుంది. అధిక డబ్బులు వసూల్ చేస్తున్నారని నేను ముందు నుంచే చెప్తున్నా. కానీ, ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : Pawan Kalyan: ఏడుకొండలవాడా క్షమించు.. పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం..
లడ్డూలో సహజంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ చేస్తారు.. అదే పెద్ద తప్పు. తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ లు ఎక్కువ ఉన్నాయి.. ఇది ఘోరమైన తప్పు అని పవన్ అన్నారు. అయోధ్యకు ఇలాంటి బీఫ్, చేప ఆయిల్ కలిపిన లక్ష లడ్డూలు వెళ్లాయి. నేను మాట్లాడేది రాజకీయ లబ్ధికోసం కాదు.. దోషులకు శిక్ష పడాలి. దేవాలయాలు అపవిత్రం చేస్తే చూస్తూ ఊరుకోను. పగ ప్రతీకార ప్రభుత్వం కాదు మాది.. తప్పు జరిగితే సహించేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏమి చేస్తుంది..? బోర్డులో వాళ్ళు బయటకి వచ్చి మాట్లాడాలి. దర్శనాల కోసం, కాంట్రాక్టులు కోసం మాత్రమే కాదు బోర్డు మెంబర్ లు ఉన్నది అని పవన్ అన్నారు. ఇలాంటి అపవిత్రాలు చర్చి, మసీదుల్లో జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. హిందూ దేవాలయాల పై జరిగితే మాట్లాడాలి కదా.
కోట్ల మంది హిందువుల అవమానం జరిగితే నేను మాట్లాడతా. చర్చిలో, మసీదులో ఇలాంటివి జరిగితే జగన్ ఊరుకునే వాడా. ఇంత జరుగుతుంటే తిరుమలలో ఉద్యోగులు ఎందుకు బయటకి చెప్పలేదని పవన్ ప్రశ్నించారు. తిరుమలలో ఉద్యోగులు బయటకి వచ్చి మాట్లాడాలి.. టీటీడీ ఉద్యోగులు మాహా అపరాధం చేశారు. దీనిపై క్యాబినెట్ మీటింగ్ లో చర్చ జరగాలి, అసెంబ్లీ లో చర్చ జరగాలని పవన్ అన్నారు. సీబీఐ విచారణ నిర్ణయం సీఎం చంద్రబాబు తీసుకుంటారు.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని పవన్ చెప్పారు.