Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్.. రూ.323 కోట్లతో ఉప్పాడ రక్షణ గోడ.. మొదలైన డీపీఆర్ పనులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత ప్రజలకు తీపి కబురు అందించారు.
- V Santhosh Kumar
- Published on- September 7, 2026 / 07:01 AM IST
uppada sea protection wall project iit madras survey begins
- రూ.323 కోట్లతో రక్షణ గోడ
- రంగంలోకి ఐఐటీ-మద్రాస్ బృందం
- డ్రోన్లతో తీరప్రాంత క్షేత్రస్థాయి సర్వే
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత ప్రజలకు తీపి కబురు అందించారు. దశాబ్దాలుగా సముద్రపు కోత సమస్యతో నానా అవస్థలు పడుతున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, డీపీఆర్ (DPR) రూపకల్పన పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి కేటాయించిన రూ.323 కోట్లతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
రంగంలోకి ఐఐటీ-మద్రాస్ నిపుణులు.. అధునాతన డ్రోన్లతో సర్వే:
తీరప్రాంత ఇంజినీరింగ్‌లో విశేష అనుభవమున్న ఐఐటీ-మద్రాస్ నుంచి వచ్చిన ఐదుగురు నిపుణుల బృందం గత వారం రోజులుగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. అడ్వాన్స్‌డ్ డ్రోన్లు, ‘ట్రింబుల్ ఆర్ 980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్టీకే’ సాంకేతికతతో షోర్‌లైన్ మ్యాపింగ్, సముద్ర అలల ప్రభావం, సీ-బెడ్ లోతులపై బాతిమెట్రిక్ అధ్యయనం చేస్తున్నారు. సముద్ర కోతను సమర్థంగా అడ్డుకునేలా సరైన ఎలైన్‌మెంట్, పక్కా డిజైన్‌ను రూపొందించడమే ఈ ప్రధాన సర్వే యొక్క లక్ష్యంగా యంత్రాంగం తెలిపింది.
నాలుగు దశాబ్దాల కల నెరవేరేవేళ.. నిబంధనల ప్రకారం వేగంగా పనులు!
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీరంలో వందలాది ఎకరాలు, గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోవడంతో ఎంతోమంది నిర్వాసితులయ్యారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీ ప్రొటెక్షన్ వాల్, గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలకు ఆమోదం లభించిందని తెలిపారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ అనుమతులు పూర్తి చేసి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
