Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan Visits Indrakeeladri: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రిపైనున్న కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని దుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఏడోరోజు దుర్గాదేవి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దీనికితోడు ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
Also Read: Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, పవన్.. ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే?
ఉదయం 9గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ 9.30గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ తోపాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. జగన్మాతకు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.