Pawankalyan
PawanKalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘కౌలు భరోసా యాత్ర’ను నిర్వహిస్తున్న విషయం విధితమే. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహించి.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. తద్వారా వారి పిల్లల చదువులకు కూడా జనసేన అండగా వుండే విధంగా ప్రణాళిక చేపట్టింది. ఈ క్రమంలో శనివారం పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అందించనున్నారు.
#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన
పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 11గంటల రాజమండ్రి మధురుపూడి విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి మండపేట కు ర్యాలీగా వెళ్తారు. మార్గ మధ్యలో మూడు కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. వేమగిరి, కడియం, దుళ్ల మీదుగా మండపేట చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగింస్తారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని పవన్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని జనసేన ఆరోపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్లు గుంతల మయంగా మారాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈరోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గంలో జరగనున్న @JanaSenaParty కౌలు రైతుల భరోసా యాత్ర. ఈ కార్యక్రమంలో శ్రీ @PawanKalyan గారు పాల్గొని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/YJuals0wRl
— JanaSena Party (@JanaSenaParty) July 16, 2022
ఈ క్రమంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వానికి, సీఎం జగన్ కు రహదారుల పరిస్థితి తెలిసే విధంగా ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ సీఎం జగన్ కు చేరుకునే విధంగా #GoodMorningCMSir అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ను సోషల్ మీడియా వేదికగా చేపట్టారు. శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ జనసైనికులు, ప్రజలు 3.55 లక్షల ట్వీట్లు పెట్టినట్లు, 218 బిలియన్ల మందికి ఈ ట్వీట్లు చేరువైనట్లు జనసేన అధిష్టానం పేర్కొంది. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగనుంది.