Peddireddy Ramachandra Reddy comments madanapalle files burnt case
Peddireddy Ramachandra Reddy : రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వ నేతలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాపోయారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లె ఫైళ్లు దగ్ధం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
”నిజాలతో సంబంధం లేకుండా మా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చంద్రబాబు తన అనకూల పత్రికల్లో అవాస్తవాలు రాయిస్తున్నారు. నాలాంటి వాళ్లపై దాడులు చేస్తున్నారు. మా కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచాం. కొన్ని చానళ్లు అత్యుత్సాహంతో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల హామీలు నెరవేర్చలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే ఆయన భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు.
Also Read : ‘వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట.. జగన్ ప్రజలపై వేసిన భారం ఇది’
మదనపల్లెలో రికార్డులు తగలబడితే మాపై నిందలు వేస్తున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినా, సీబీఐకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించడమే కాకుండా.. వారి ద్వారా నా పేరు చెప్పించేందుకు కుట్ర జరుగుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అతి దారుణంగా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో కూటమి ప్రభుత్వం వేగంగా పనిచేసిందా? మదనపల్లెలో రికార్డులు తగలబడితే ఏదో జరిగిపోతోందనేలా డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమి మమ్మల్ని ఇరికించాలనే అత్యుత్సాహంతో డీజీపీని పంపించి చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. ఏదీఏమైనా ఈ కుటలన్నీ ఎదుర్కొంటాం. మాపై పెట్టిన కేసులు తప్పని నిరూపిస్తామ”ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.