కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తీసుకురాలేకపోయారు.. చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచి పదవి పొందాలనుకోవడం లేదని.. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

peddireddy ramachandra reddy slams chandrababu over handri neeva

Peddireddy Ramachandra Reddy: వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022 సెప్టెంబర్ లో సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగానే కుప్పంకు హంద్రీనీవా జలాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. హంద్రీనీవా కుప్పంకు జీవనాడిలా ఉంటుందని దీని ద్వారా 54 చెరువులకు 6300 ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. పాలారు ప్రాజెక్టును తమిళనాడు జయలలిత ప్రభుత్వం అండతో అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు. కుప్పం పర్యటనలో పాలారు ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఎన్నికల తర్వాత కుప్పంలో మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని, 24 గంటలు సాగునీరు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 35 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తీసుకురాలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. కుప్పంలో సాగునీటికి తాగునీటికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగున్నర ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. కుప్పం అభివృద్ధిపై సీఎం జగన్ చూపిన శ్రద్ధలో 10% కూడా చంద్రబాబు చూపలేదని ఆరోపించారు.

Also Read: టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితాపై హరిరామ జోగయ్య సంచలన కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచి పదవి పొందాలనుకోవడం లేదని.. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు