వీరపోరాటం చేసి తన ప్రాణమిచ్చి యజమాని కుటుంబాన్ని కాపాడిన పెంపుడు కుక్క

  • Publish Date - November 16, 2020 / 12:24 PM IST

pet dog saves owners family: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుక్క విశ్వాసం కుటుంబాన్ని కాపాడింది. తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా…యజమాని కుటుంబాన్ని కాపాడింది ఆ శునకం. చింతలపూడిలో ఈ ఘటన జరిగింది. కొవ్వూరుగూడెంకు చెందిన రిటైర్డ్ టీచర్ నాగేశ్వరరావు ఇంట్లోకి ఓ పాము ప్రవేశించింది. నాగేశ్వరరావు ఇంట్లో ఉండే పెంపుడు కుక్క దాన్ని చూసింది. యజమాని కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఆ శునకం…ఆరు అడుగులు ఉన్న త్రాచు పాముతో పోరాటానికి దిగింది.

తీవ్రమైన పోరాటం చేసి పామును గాయపరిచింది. ఆ సమయలోనే రాయ్‌ను పాము చాలాసార్లు కాటువేసింది. అయినా కుక్క వెనక్కి తగ్గలేదు. తనను ఎన్ని కాట్లు వేస్తున్నా లెక్క చేయకుండా….పాముతో పోరాడి.. పోరాడి దాన్ని చంపేసింది. అయితే పాము కాట్ల కారణంగా…విషసర్పం మృతి చెందిన అరగంటలోనే కుక్క కూడా ప్రాణాలు విడిచింది.

రాయ్ అని తాము ముద్దుగా పిలుచుకునే శునకం… తమను రక్షించేందుకు ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. రాయ్ కోసం వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐదేళ్లగా నాగేశ్వరరావు కుటుంబంలో మమేకమైన రాయ్…వారి కోసం ప్రాణాలు అర్పించి…యజమాని కుటుంబంపై తన విశ్వాసాన్ని చాటుకుంది. కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. దాన్నే నిరూపించింది ఈ శునకం.

ట్రెండింగ్ వార్తలు