సొంత పార్టీ నేతనే టార్గెట్ చేసిన పిల్లి సుభాష్, దీని వెనుక పెద్ద వ్యూహామే ఉందని టాక్

  • Publish Date - November 26, 2020 / 12:00 PM IST

pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎలాగైనా ఆధిపత్యం చలాయించాలనుకుంటున్న నాయకుల మధ్య వైరం రోజు రోజుకూ ఎక్కువ కావడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు. తాజాగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రికి రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

త్రిమూర్తులును టార్గెట్‌ చేస్తూ హోంమంత్రికి సుభాశ్‌ చంద్రబోస్‌ లేఖ:
రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎప్పటికప్పుడు వ్యవహారాలను సెట్‌ చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. సద్దుమణిగేలా కనిపిచడం లేదని కేడర్‌ అంటోంది. తోట త్రిమూర్తులును టార్గెట్‌ చేస్తూ హోంమంత్రి సుచరితకు ఎంపీ సుభాశ్‌ చంద్రబోస్‌ ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఆ విషయం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.

త్రిమూర్తులుపై తీవ్ర వ్యతిరేకత:
దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలంటూ సుభాశ్‌ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తోట త్రిమూర్తులు వైసీపీలో చేరినప్పటి నుంచి ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆయన చేరికను అడ్డుకునేందుకు వైసీపీలోని పలువురు నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ, అధిష్టానం త్రిమూర్తుల చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు వైసీపీ నేతలు. అయినా ఎప్పటికప్పుడు ఈ వర్గాల మధ్య విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి.
https://10tv.in/lover-kills-girl-friend-as-she-refuse-to-suicide/
20 ఏళ్లుగా తోటను వెంటాడుతున్న కేసు:
ఇప్పుడు తాజాగా పాత కేసు దళితుల శిరోముండనం వ్యవహారాన్ని పిల్లి సుభాశ్‌ మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు. ఈ కేసులో ఏ-1గా తోట త్రిమూర్తులు ఉన్నారు. 20 ఏళ్లుగా ఈ కేసు ఎటూ తేలకుండా త్రిమూర్తులు పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో దళితులపై కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాలను ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో దళితులను ఆదుకొనే విషయంలో వైసీపీ సర్కారు ఎప్పుడూ ముందుంటుందనే సంకేతాలను ఇచ్చే ఆలోచనలో ఉందని అంటున్నారు.

త్రిమూర్తులును టార్గెట్‌ చేయడంతో పాటు టీడీపీని కూడా ఇరకాటంలో పెట్టాలనే ప్లాన్‌:
నిజానికి ఈ వ్యవహారం త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా గెలిచి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగినందున.. అప్పట్లో దళితులపై దాడులు మరింత ఎక్కువగా జరిగేవని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నమని చెబుతున్నారు. త్రిమూర్తులును టార్గెట్‌ చేయడంతో పాటు టీడీపీని కూడా ఇరకాటంలో పెట్టాలనే ఈ ప్లాన్‌ వేశారని టాక్‌.

దళితులకు అండగా నిలబడతామని చెప్పడమే పిల్లి లక్ష్యం:
ఇప్పుడు దళితుల శిరోముండనం కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేనందున వారి తరఫున ఎంపీ పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ రంగంలోకి దిగారని, ఒకే పార్టీకి చెందిన నేత కావడంతో దళితులకు తాము అండగా నిలబడతామని చెప్పే లక్ష్యంగా ఈ లేఖ రాశారని అంటున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీని కూడా ఇరికించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి ట్విస్ట్‌లు తీసుకుంటుందో.. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=I_LhWhliX_0

ట్రెండింగ్ వార్తలు