సీఎం జగన్ పై దాడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు ఏమన్నారంటే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

Attack On CM Jagan : విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ, చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు.

 

సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

సీఎం జగన్ పై రాయి దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని ఆయన అన్నారు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు స్టాలిన్. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్..
సీఎం జగన్ పై దాడి వార్త బాధ కలిగించింది. జగన్ కు రాష్ట్రంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ దాడులకు దిగుతోంది. బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడా దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించాలని పధకాలు రచిస్తున్నారు. డు రోజుల క్రితం ఒంగోలులో గొడవకు దిగారు. ఇప్పుడు ఏకంగా సీఎం పైనే దాడికి దిగి వారి నైజం బయటపెట్టుకున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ఉపయోగించి టీడీపీకి తగిన బుద్ది చెబుతారు. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మంత్రి రోజా..
సీఎం జగన్ కి వ‌స్తున్న ఆద‌రణ చూసి ఓర్వ‌లేక విజ‌య‌వాడ‌లో ఆయ‌న‌పై దాడి చేశారు టీడీపీ పిరికిపంద‌లు. నేడు వారు విసిరిన రాళ్ళే ఓట్లుగా మారి మే 13న వారిని కోలుకోలేని దెబ్బ‌తీస్తాయి. నేరుగా ఎదుర్కోవ‌డం చేత‌గాని ఇలాంటి వారికి రాజ‌కీయాలు ఎందుకు?

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయి వచ్చి తగిలింది. సీఎం జగన్ కన్నుబొమ్మకు వేగంగా రాయి తాకింది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి జగన్ ఎడమ కంటి నుదుటిపై రాయి తగలడంతో గాయమైంది. పూలతో పాటు రాయి కూడా విసిరాడు ఆగంతకుడు.

ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. జగన్ కు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : సీఎం జగన్‌పై దాడి.. వైఎస్ షర్మిల, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు