pm narendra modi
PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లాలో మోదీ పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ ఇదే..
♦ 16వ తేదీ ఉదయం 7.50గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరుతారు.
♦ ఉదయం 10.20 గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
♦ ఉదయం 11.10 గంటలకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు మోదీ చేరుకుంటారు.
♦ ఉదయం 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.
♦ మధ్యాహ్నం 1.40 గంటలకు సుండిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు.
♦ మధ్యాహ్నం 2.30కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
♦ సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
♦ సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని.. సాయంత్రం 4.40 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో జరిగే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ హిట్’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, సీఎస్ విజయానంద్, సీఎంవో ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
కర్నూలు సమీపంలోని నన్నూరు రంగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ హిట్’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ పాల్గొనే సభకు సుమారు మూడు లక్షల మంది రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సభా వేదికను నిర్మిస్తున్నారు.
ప్రధాని వేదిక, హాజరైన వారు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఏకంగా 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా బస్సులు, ఇతర వాహనాలు నిలిపేందుకు 374 ఎకరాల్లో సువిశాల ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు.