PM Narendra Modi
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మే 2వ తేదీన సాయంత్రం ప్రధాని అమరావతికి చేరుకొని.. రాజధాని ప్రాంతంలో పనులను పున:ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
మే 2వ తేదీన సాయంత్రం 4గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రాజధాని పనులు పున: ప్రారంభిస్తారు. మోదీ రాక సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ కే. విజయానంద్ ను చంద్రబాబు ఆదేశించారు.
ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించామని, ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు. ప్రధానితోపాటు ఇతర ప్రముఖుల కోసం నాలుగు హెలీప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేయాలని నిర్ణయించారు. ఈ నాలుగో హెలీప్యాడ్ ను రైతుల లే ఔట్ లో రెడీ చేయాలని నిర్ణయించారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లకోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. బహిరంగ సభకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణను రూపొందించారు. సభకు వచ్చేవారి కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధాని హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరువైపులా రైతులు, మహళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ స్వాగతంపలికేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షించనుంది.