Rahul Murder Case : రాహుల్‌ హత్య కేసు..రహస్య ప్రాంతంలో కోరాడ విజయ్‌కుమార్‌ విచారణ

విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు... రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Rahul

Police investigating Vijay Kumar : విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు… అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రాహుల్‌ హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ హత్యలో ముగ్గురు మహిళలు, కోగంటి సత్యం పాత్రపై కూపీ లాగుతున్నారు.

కంపెనీలో ఎవరెవరు పార్ట్‌నర్స్‌గా ఉన్నారు, ఎంత పెట్టుబడులు పెట్టారన్న దానిపై విజయ్‌కుమార్‌ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే విజయ్‌కుమార్‌ మాత్రం… కంపెనీలో తానే మేజర్‌ పెట్టుబడి పెట్టానని.. అలాంటప్పుడు తనకు తెలియకుండానే రాహుల్‌ అనేక మందిని చేర్చుకున్నాడని చెప్పినట్టుగా తెలుస్తోంది. హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటి, తన మనుషులు ఎవరైనా హత్యలో ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 18న విజయవాడలో రాహుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పాత్రధారులుగా అనుమానిస్తున్న మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా ఆయన భార్య కోరాడ పద్మజను చేర్చారు.

ఇక ఏ3గా గాయత్రి, ఏ4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు పోలీసులు. హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఇక రాహుల్ మర్డర్‌ కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ బాబును పోలీసులు విచారించారు. కోగంటి సత్యం పాత్ర గురించి విజయ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా రాహుల్‌ హత్య కేసులో కోగంటి సత్యం హస్తముందో, లేదో పోలీసులు నిర్ధారించనున్నారు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

ఇదే అంశంలో ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. కంపెనీలో వాటా విషయంలో కోగంటి సత్యం ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటినుంచి రాహుల్‌ హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.