Nara Lokesh : నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీడీపీ నేత నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Nara Lokesh

Police arrest Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్‌ బయల్దేరారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా పర్యటనకు అనుమతి లేదని చెప్పారు.

లోకేష్ ను అదుపులోకి తీసుకుని ఉండవల్లి నివాసానికి తరలిస్తున్నారు. లోకేష్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన చినరాజప్ప, వంగలపూడి అనిత, తెలుగు యువత అధ్యక్షుడు చినబాబు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు ఉన్నారు. లోకేశ్‌ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఎయిర్ పోర్టు లోపల టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

పోలీసులు తనను అడ్డుకోవడంపై నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని.. ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళ్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తానని వ్యాఖ్యానించారు.