దేవరగట్టు కర్రల సమరం రద్దు : 144 సెక్షన్ విధించిన పోలీసులు

  • Publish Date - October 26, 2020 / 10:58 AM IST

police impose ban on devaragattu stick fight : దసరా పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే కర్రల సమరంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అక్టోబర్26, సోమవారం రాత్రి కర్రల సమరం జరిపేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది కర్రల సమరాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

క‌ర్నూలు జిల్లా దేవ‌ర‌గ‌ట్టులో మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌యం వ‌ద్ద ద‌స‌రా సంద‌ర్భంగా…విజయదశమి పండుగ తర్వాత రోజు బన్నీ ఉత్సవం జ‌రుగుతుంది. మాళ మ‌ల్లేశ్వ‌రుల‌ ఉత్స‌‌వ విగ్ర‌హాల కోసం ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ ఉత్స‌వాల‌ను చూడ‌టానికి ల‌క్ష‌లాది మంది హాజ‌రవుతారు.



దసరా వచ్చిందంటే చాలు చాలా మంది దృష్టి దేవరగట్టులో జరిగే కర్రల సమరంపైనే ఉంటుంది. రణరంగాన్ని తలపించేలా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో బాదుకుంటారు. నెత్తురోడుతున్న పట్టించుకోకుండా కర్రల సమరంలో పాల్గొంటారు. ఈ సమరంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి.
https://10tv.in/red-light-on-engine-off-arvind-kejriwal-calls-on-public-to-fight-air-pollution-in-delhi-ncr/
అయినా ప్రతి ఏటా దసరా సందర్భంగా అక్కడి ప్రజలు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బయటి వ్యక్తులు దేవరగట్టుకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



సరిహద్దు ప్రాంతాల్లో 11 పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలూరు, హోలగొంద, హాలహర్వి మండలాలకు తిరిగే కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈరోజు సాయంత్రం వరకు రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించారు.

అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను రద్దు చేయడం వల్ల అరిష్టం దాపురిస్తుందని దేవరగట్టు సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ సంప్రదాయాలను ఎలాగైనా కొనసాగించేందుకు వివిధ గ్రామాల ప్రజలు రెడీ అవుతున్నారు.



ఈ రోజు రాత్రి దేవరగట్టులో ఏం జరగబోతోందనే టెన్షన్ ఇప్పటికే మొదలైంది. మరోవైపు మంత్రి జయరాంతో ఆదోని డీఎస్పీ, ఆర్డీవో భేటీ అయ్యారు. కర్రల సమరం జరగకుండా నియోజకవర్గ ప్రజలకు నచ్చచెప్పాలని మంత్రి జయరాంను అధికారులు కోరారు.