blast on Rail tracks in Tirupati : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు.. బ్లాస్ట్ జరిగిన స్థలంలో అమ్మోనియం నైట్రేట్ అవశేషాలను గుర్తించారు. బాక్స్ ఎవరు తెచ్చారు. అమ్మోనియం నైట్రేట్ ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బాధితురాలు శశికళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పేలుడు ధాటికి కుడి చేతికి సంబంధించిన మూడు వేళ్లు, కాలు తెగిపపడ్డాయి. కొన్ని పశువులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని అదిలించేందుకు ట్రాక్ పైకి వెళ్లారు. ఒక్కసారిగా అదే సమయంలో ట్రాక్ పక్కనే ఉన్న చిన్నపాటి బాక్స్ ను చూశానని, పక్కకు పడేయడంతో అది పేలిందని బాధితురాలు చెబుతోంది. ఆ పేలుడు ధాటికి తనకు గాయమైనట్లు చెప్పింది.
రైలు పట్టాలపైకి పేలుడు పధార్థం ఎలా వచ్చిందన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ఏదైనా విద్రోహ కోణం ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రైల్వే పోలీసులు, రేణిగుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
వారంతా ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.