Kakani Govardhan: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు..

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆదివారం కాకాణి నివాసానికి వెళ్లారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో పాటు, ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఆ నోటీసులు ఇంటి ప్రధాన గేటుకు అంటించారు.

 

సోమవారం ఉదయం 11గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, కాకాణి ఇవాళ విచారణకు హాజరు కాలేదు. ఉగాది పర్వదినాన్ని హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి లేకపోవటంతో ఆయన కజీన్ కి పోలీసులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 1న (మంగళవారం) ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

 

ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ముగ్గురురిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది. అయితే, పోలీసుల నోటీసుల ప్రకారం ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.