AP Politics: వరద సాయం సెంట్రిక్‌గా ఏపీ రాజకీయం

వరద సాయం మీద విమర్శలకు.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో పాటు జగన్‌ ఇస్తానన్న కోటి రూపాయల తేవడంతో.. ఫ్యాన్‌ పార్టీ డైలామాలో పడింది.

Godavari Floods

వానొచ్చిపోయింది. వరదలో మునిగేటోళ్లు మునిగిపోయారు. జరగాల్సిన నష్టమేదో జరిగిపోయింది. చేయాల్సిన సాయమేదో చేసేశారు. ఎవరి పనుల్లో వారున్నారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు..ఇప్పుడు వరద సాయం మీద రచ్చ స్టార్ట్ చేసింది వైసీపీ. ఆగస్ట్‌ ఎండింగ్‌లో బుడమేరు బెజవాడను గజగజ వణికించేసింది.

బుడమేరు పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఫీల్డ్‌ విజిట్ చేసి..డ్రోన్లతో ఫుడ్, మెడిసిన్, పాల ప్యాకెట్లు అందేలా చూశారు. పైగా ఆర్థిక సాయం కూడా అందజేశారు. అదంతా అయిపోయింది. వరద నుంచి జనం కోలుకున్నారు కూడా. వరద సాయం రాజకీయం మాత్రం ఒడవడం లేదు.

విజయవాడ వరద బాధితుల కోసం వచ్చిన విరాళాలు ఏమైయ్యాని వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తోంది. వరద సాయంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు కక్కుర్తిపడ్డారని..అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపిస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారు?
పులిహోరకు 23కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు చూపించారని చెబుతోంది వైసీపీ. 5వందల కోట్ల రూపాయల చీఫ్‌ మినిస్టర్ ఫండ్ ఏమైంది.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలంటోంది. అయితే చంద్రయాన్‌ కోసం 618 కోట్లు ఖర్చు అయితే చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు 5వందల కోట్లని ట్రోల్ చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.

వరద సాయంపై వైసీపీ విమర్శలపై అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది టీడీపీ. లెక్కలతో సహా కౌంటర్ ఇస్తోంది. అడ్డగోలుగా ప్రచారం చేయడం కాదు..దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చర్చకు రండి అంటూ ఛాలెంజ్ చేశారు హోంమంత్రి అనిత. వరదసాయంపై చర్చించడానికి తాము సిద్ధమని..వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అంటూ సవాల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశామని.. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు చెప్తున్నారు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా ప్రచారం చేస్తారని ఫైర్ అవుతున్నారు. వరద సాయం అందించడమే కాకుండా..బుడమేరు గండ్లను కూడా పూడ్చామన్న విషయాన్ని మరవొద్దంటోంది టీడీపీ.

ఎగ్ పఫ్‌లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదని చురకలు అంటిస్తున్నారు. ఈ గొడవంతా ఇలా నడుస్తుండగానే ఇంతకీ వరద బాధితులకు మీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించిన కోటి రూపాయల సాయం ఏమైందని క్వశ్చన్ చేస్తోంది టీడీపీ. ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌ లెక్కల్లో అయితే జగన్‌ విరాళం ఇచ్చినట్లు డిటేయిల్స్ లేవన్నారు హోం మినిస్టర్ వంగలపూడి అనిత.

ఆ కోటి రూపాయల మ్యాటరేంటి?
వరద సాయం గొడవ కాస్త..జగన్‌ ప్రకటించిన సాయం మీదకు టర్న్ అయింది. ఆ కోటి రూపాయల మ్యాటరేంటి అంటూ టీడీపీ అపోజిషన్‌ను కార్నర్ చేస్తోంది. మంత్రి లోకేశ్‌ కూడా ఫేస్‌బుక్‌ వేదికగా వైసీపీ తీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వకపోగా..ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పంపిణీ చేయని జగన్..విషం కక్కుతున్నారని మండిపడ్డారు.

వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు అయినట్లు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రూ.23 లక్షలు కూడా ఖర్చు కాలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కుని ఎగ్‌పఫ్‌ల పేరుతో కోట్లు మెక్కేశారని మండిపడ్డారు లోకేశ్‌.

వరద సాయం మీద విమర్శలకు.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో పాటు జగన్‌ ఇస్తానన్న కోటి రూపాయల తేవడంతో.. ఫ్యాన్‌ పార్టీ డైలామాలో పడింది. అధికార పార్టీని బద్నాం చేయబోయి..తమ అధ్యక్షుడు ప్రకటించిన సాయం అందించలేదన్న విషయాన్ని తామే తెరమీదకు తెచ్చామని గుసగుస పెట్టుకుంటున్నారట. ఇంతకీ బాస్‌ కోటి రూపాయలు ఇచ్చారా లేదా అని చర్చించకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు.

జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..