నాడు కట్టెలు కొట్టిన మహిళ నేడు మేయర్.. తోపుడుబండి, కూరగాయల వ్యాపారులు మున్సిపల్ చైర్మన్లు

ఆమె ఓ సాధారణ మహిళ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు లేరు. రోజంతా కష్టపడితేనే నాలుగు మెతుకులు దొరికేది. కుటుంబం గడవడం కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మిన రోజులున్నాయి. కట్ చేస్తే.. నాడు కట్టెలు కొట్టిన ఆమె.. నేడు మేయర్ అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా అముద ఎన్నికయ్యారు.

Common Man Become Mayor, Chairman

Poor Common People Become Mayor, Chairman: ఆమె ఓ సాధారణ మహిళ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు లేరు. రోజంతా కష్టపడితేనే నాలుగు మెతుకులు దొరికేది. కుటుంబం గడవడం కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మిన రోజులున్నాయి. కట్ చేస్తే.. నాడు కట్టెలు కొట్టిన ఆమె.. నేడు మేయర్ అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా అముద ఎన్నికయ్యారు.

ఆమె ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు కట్టెలు కొట్టి అమ్మింది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. జగన్‌ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది అముద.

‘‘మాది పేద కుటుంబం. అమ్మానాన్న చనిపోయేనాటికి నాకు ఊహ కూడా తెలియదు. అక్క నాగభూషణం కుటుంబ బాధ్యత తీసుకుంది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. ఆమె పడుతున్న కష్టం చూసి.. మేముంటున్న చోటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవి. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం, ఓ తమ్ముడు. ఇంత కష్టపడితే ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడ్డాం. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్‌ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి.. పార్టీకి మంచిపేరు తీసుకొస్తాను’’ అని అముద తెలిపారు.

మున్సిపల్‌ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి:
ఇక కడప జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కూరగాయల వ్యాపారి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. స్థానికు నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నా అవేవీ పట్టించుకోకుండా.. ప్రజాదరణ కలిగిన కూరగాయల వ్యాపారిని మున్సిపల్ చైర్మన్ గా చేశారు సీఎం జగన్. రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్‌ చైర్మన్‌గా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది.

రాయచోటికి చెందిన షేక్‌ బాషా డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్‌ బాషాకు వైఎస్సార్‌ సీ‌పీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ ‌బాషాను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా బాషా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ బాషా సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదన్నారు.

మామ అటెండర్‌గా పనిచేసిన చోట.. కోడలు మేయర్‌
మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్‌(అటెండర్‌)గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు.

అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, ఆయన కుటుంబీకులు ఆనందంలో మునిగిపోయారు. మునెయ్యకు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రి అధినేత డాక్టర్‌ మునిశేఖర్‌ పెద్దకుమారుడు. ఈయన భార్యే డాక్టర్‌ శిరీష. చిన్న కుమారుడు తులసీయాదవ్‌ టౌన్‌బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. కడప జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి, కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి 2011లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం తిరుపతిలోని ఆశాలత టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతోపాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు.

తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్‌ చైర్మన్‌
తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్‌ చైర్మన్‌ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఇంటర్‌ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్‌సీపీ టికెట్‌ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.