Cm Chandrababu On Ports: ఏపీ.. అభివృద్ధిలో సౌత్ లోనే నెంబర్ 1 అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ సహా అనేక అంశాల్లో ఏపీకి ఉన్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. అంతకుముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.
మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిత్ సందర్భంగా రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రోడ్లు, రైళ్లు, సముద్ర రవాణ పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక అమరావతికే తలమానికంగా నిలిచే క్వాంటం కంప్యూటింగ్ గురించి కూడా మాట్లాడారు. ఏఐ క్వాంటం వ్యాలీ పరిధి పెరుగుతుందని గుర్తు చేశారు.
విశాఖ నోవాటెల్ లో ఏర్పాటైన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీకి ఉన్న అనుకూలతలను వివరించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, రైలు కనెక్టివిటీ విషయంలో ఏపీకి అడ్వాంటేజ్ ను పారిశ్రామికవేత్తలకు గుర్తు చేశారు చంద్రబాబు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా పనులు చేయబోతున్నట్లు వెల్లడించారు.
అలాగే ఎయిర్ కార్గో వసతులు పెంచాలని సభకు హాజరైన లాజిస్టిక్ కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మిట్ లోనే ఎయిర్ కార్గో ఫోరం ఇండియా లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు.