ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల జగడం.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆపేది లేదన్న ఏపీ

  • Publish Date - October 7, 2020 / 03:24 PM IST

Pothireddypadu Reservoir: ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. కేంద్ర జలశక్తి మంత్రితో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపించాయి. కానీ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది ఏపీ. ఈ అంశంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోతిరెడ్డిపాడు కడితే ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కడతామని తెలంగాణ స్పష్టం చేస్తోంది. ఎవరికి వారు తమ వాదన బలంగా వినిపిస్తుండటంతో ఈ వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం(అక్టోబర్ 6,2020) వాడీవేడిగా సాగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ వాదనలు వినిపించారు. కాగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) సమర్పించడానికి ఇద్దరు సీఎంలూ అంగీకరించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ నుంచి, ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి.. ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో.. కృష్ణా, గోదావరి నదీ జలాలపై హక్కులు, వాటాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను, వాదనలను వినిపించారు. సమావేశంలో ఎజెండా అంశాల వారీగా కాకుండా ఖరారు చేసిన నాలుగు ఎజెండాలపై కేంద్రం ఒకేసారి తన అభిప్రాయాలను సీఎంల ముందు ఉంచింది.

కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్‌ చేశారు. ‘‘ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయకుండా మీరు ఏది చేసినా వృథానే. అన్ని సమస్యలకు ట్రైబ్యునళ్ల ఏర్పాటే పరిష్కారం’’ అని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. కాగా కృష్ణా, గోదావరి నదులపై కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ దే అని కేంద్రమంత్రి షెకావత్ స్పష్టం చేశారు.