×
Ad

విశాఖలోని కేజీహెచ్‌లో కొన్ని గంటలపాటు నిలిచిన విద్యుత్‌ సరఫరా.. ఒకరి మృతి..

ఆసుపత్రిలోని ప్రధాన వార్డులకు విద్యుత్‌ అందలేదు. ఐసీయూ, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సేవలు తీసుకుంటున్న రోగుల కోసం జనరేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారు.

Visakhapatnam KGH: విశాఖలోని కేజీహెచ్‌లో నిన్న విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు విద్యుత్‌ రావడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం యథావిధిగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తెగిన విద్యుత్ కేబుళ్లను సిబ్బంది అమర్చారు.

కాగా, మర్రిపాలేనికి చెందిన దేవి (45) ఆసుపత్రిలోని రాజేంద్రప్రసాద్‌ వార్డు కరెంట్ లేక, ఆక్సిజన్ అందక మృతి చెందింది. ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (Visakhapatnam KGH)

విద్యుత్‌ ఎందుకు నిలిచిపోయింది?

మార్చురీలో నిన్న అండర్‌ గ్రౌండ్‌ పనులు నిర్వహించారు. ఆ సమయంలో విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో కరెంట్ నిలిచిపోయింది. ఆసుపత్రిలోని ప్రధాన వార్డులకు విద్యుత్‌ అందలేదు. ఐసీయూ, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సేవలు తీసుకుంటున్న రోగుల కోసం జనరేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారు.

మిగతా వార్డులలోని రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. విద్యుత్‌ నిలిచిపోవడంతో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. గత రాత్రి కేజీహెచ్‌లో రోగులు చిమ్మచీకట్లో గడిపారు. ఈ ఆసుపత్రిలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు.