Visakha steel plant privatization : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వబోమని చెబుతున్నారు. ఇవాళ స్టీల్‌ప్లాంట్ పరిపాలనా భవన ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు క్లారిటీ ఇవ్వడంతో… కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు విశాఖ కూర్మన్నపాలెంలో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సాయంత్రం మొదలైన ఆందోళనలు రాత్రి పొద్దుపోయే జరిగాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కూర్మన్నపాలెం జంక్షన్‌వైపు వచ్చిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజును కార్మిక సంఘాల నాయకులు, అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు, జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపైనే కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ ప్రతులను దహనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
పుండు మీద కారం చల్లినట్లు బీజేపీ వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎవరు కొనడానికి వస్తారో చూస్తామని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటి చైర్మన్ నర్సింగరావు హెచ్చరించారు. రాష్ర్టానికి సంబంధం లేదని కేంద్రం చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఏపీలో బీజేపీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై… మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని… దాని ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన హామీనిచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ అంశంపై గతంలో కేంద్రమంత్రులను కూడా కలిశామని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. స్టీల్ ప్లాంట్‌పై తమ వైఖరి మారబోదని స్పష్టం చేశారు. మొత్తానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి పెంచుతున్నారు.