Site icon 10TV Telugu

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్.. పోలీసుల భారీ బందోబస్తు.. పలువురు నేతలు అరెస్టు.. గృహనిర్భందం

Pulivendula Ontimitta ZPTC BY Elections

Pulivendula Ontimitta ZPTC BY Elections

Pulivendula, Ontimitta ZPTC BY Elections: వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7గంటలకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.

పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలో 11మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 10,600 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం పరిధిలో 24వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లో 1400మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు మండలంలో ఉండకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం వద్ద, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.

పోలింగ్ సందర్భంగా ఉద్రికత్తలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. మరికొందరిని గృహనిర్భందం చేశారు. పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని గృహనిర్భందం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన్ను ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. చింతరాజుపల్లె పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల ఏజెంట్లను బయటకు పంపించివేశారు.

Exit mobile version