Site icon 10TV Telugu

Pulivendula: పులివెందులలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్..

YS Avinash Reddy

YS Avinash Reddy

Pulivendula ZPTC BY Election: పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక‌ పోలింగ్ జరగనుంది. దీంతో తెల్లవారుజామున అవినాశ్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ను గృహనిర్భందం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసుల తీరును తప్పుబడుతూ ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టుకు ముందు పోలీసుల తీరును నిరసిస్తూ అవినాశ్ రెడ్డి తన నివాసం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా..? మా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపాల్సిన పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. ఇంతదారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదంటూ అవినాశ్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలకు సంబంధించి ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు బ్యాలెట్ విధానంలో జరగనుంది. 14వ తేదీన ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పులివెందులలో మొత్తం 10,601 ఓటర్లు ఉండగా.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు.. మొత్తం 11మంది బరిలో నిలిచారు. పులివెందులలో పోలింగ్ నిర్వహణకు 150మంది పోలింగ్ సిబ్బందిని నియమించగా.. 700మందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు.

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప‌ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈస్థానం నుంచి 11 మంది పోటీలో నిలవగా.. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు 788మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 180మంది సిబ్బందిని కేటాయించగా.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Exit mobile version