Pulivendula ZPTC by Poll
Pulivendula: వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఘర్షణలు, నిరసనలు మధ్య పోలింగ్ జరిగింది. అయితే, ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికకు సంబంధించి రెండు కేంద్రాల్లో ఇవాళ రీ పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ కొనసాగుతుంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన 3, 4 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో 3, 14 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆదేశించినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. దీంతో అచ్చివెల్లి, ఇ. కొత్తపల్లి, పంచాయితీలకు సంబంధించి తిరిగి ఎన్నికల నిర్వహణకు అధికార యాంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5వరకు రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. దీంతో పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం ఓటింగ్ నమోదైంది. ఈనెల 14న (గురువారం) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
జడ్పీటీసీ ఉపఎన్నికలపై జగన్ ట్వీట్..
పులివెందుల నియోజకవర్గంలో ఒక జడ్పీసీటును బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఒంటిమిట్టలో జడ్పీటీసీ సీటును కైవసం చేసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాలను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం దెబ్బతిన్న ఈరోజు నిజంగా బ్లాక్ డే అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం గెలిచింది: నారా లోకేశ్
దాదాపు 30ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పులివెందుల ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.