YS Jagan Mohan Reddy
ప్రస్తుత రాజకీయాల్లో సభలు..ర్యాలీలు వాటికి వచ్చే జనాలు ఇంపార్టెంట్‌గా మారాయి. అందుకే ఎక్కడికి అధినేత వస్తున్నారన్న చిన్న చితకా లీడర్లు అంతా పోలరైజ్ అధినేత పర్యటనలో పోటెత్తడం కామన్ అయిపోయింది. అయితే ఏ పార్టీకైనా క్యాడరే బలం, బలగం అయినప్పటికీ..ఆ కార్యకర్తలు, అభిమానులే బలహీనతగా మారొద్దన్నది మాత్రం అసలు పాయింట్. ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ చేసే అతి మీదే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది.
జగన్ పరామర్శలకు వెళ్లడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం..క్యాడర్ ఆయనకు తోడుగా ముందుకు సాగడం వరకు ఓకే. కానీ కొందరి అభిమానం హద్దులు దాటి చేస్తున్న ఓవరాక్షనే వైసీపీకి చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ పిచ్చి ఫ్యాన్స్ ఇవి మానుకుంటేనే బెటర్ అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. వైసీపీ కార్యకర్తల అతి ఎంత తగ్గించుకుంటే జగన్‌కు, వైసీపీ ఫ్యూచర్‌కు..అన్నింటికి మించి సమాజానికి అంత మంచిదన్న ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటించారు. ఈ టూర్‌లో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు వీటికి సంబంధించిన చర్చంతా ఒకెత్తు అయితే..ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరొకెత్తు. ఆ ఫ్లెక్సీల్లో రాసిన డైలాగులు ఇంకొకెత్తు. దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
రెడ్ బుక్ మహిమ..11 సీట్ల ఫ్రస్ట్రేషన్ పీక్‌కు చేరడంతో..జగన్ ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయని మండిపడుతున్నారు కూటమి నేతలు. జగన్ టూర్‌లో సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు పెట్టడం అందులో రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర పదజాలంతో అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారుతోంది.
జగన్ రెంటపాళ్ల పర్యటనలో పలువురు ప్రదర్శించిన ప్లకార్డులు దుమారం లేపుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్పా అని ఒకరు. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అని మరికొందరు. పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం..నా కొడకల్లారా అంటూ..అన్న వస్తాడు..అంతు చూస్తాడన్న ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
జగన్ కవర్ డ్రైవ్‌పై తీవ్ర విమర్శలు
కార్యకర్తలు పుష్పా డైలాగులు రాస్తే కూడా తప్పేనా అంటూ జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా డైలాగ్‌ను కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా? అని జగన్ ప్రశ్నించారు. పైగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓ టీడీపీ కార్యకర్త టీడీపీని రప్పా, రప్పా అని నరుకుతానని ప్లకార్డు ప్రదర్శించారంటూ చెప్పుకొచ్చారు జగన్. అంటే కూటమి పాలన అంత అధ్వాన్నంగా ఉందన్నమాట అంటూ ట్విస్ట్ ఇచ్చారు జగన్.
అయితే జగన్ కవర్ డ్రైవ్‌పై తీవ్ర విమర్శలే వ్యక్తం అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల జగన్ పర్యటనను, కార్యకర్తల ప్లకార్డులను కోట్ చేస్తూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్న చంద్రబాబు..ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా అంటూ ప్రశ్నించారు. చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా.? జనం మీకు 11 సీట్లు ఇచ్చింది ఇందుకు కాదా అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను..హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు.
జగన్ భయపెట్టి రాజకీయం చేద్దామనుకుంటున్నారని..రౌడీలకు నాయకత్వం వహిస్తానన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నమ్ముకున్న రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదేనని..ఏడాది క్రితం YCPని ప్రజలు రప్పా రప్పా నరికిన విషయాన్ని మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు. ఇలా వైసీపీ క్యాడర్ అతిపై కూటమి పార్టీల నుంచే కాదు పబ్లిక్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందట. క్యాడర్‌ను కంట్రోల్ చేయకపోతే జగన్‌కు, పార్టీకి నష్టమన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.