Abhimanyu Easwaran: “7,841 పరుగులు, 27 సెంచరీలు.. అయినా ఒక్క ఛాన్సూ రాలేదు.. ఇప్పుడు నం.3 స్థానానికి “సరైనోడు” ఇతడే

Abhimanyu Easwaran
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌ను ప్రారంభించేందుకు భారత జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోవడంతో యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం.
ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ, జాతీయ జట్టు తలుపు తడుతున్న ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది. అతనే అభిమన్యు ఈశ్వరన్. దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ఆటతీరు, ఇంగ్లండ్ గడ్డపై అతడి ఇటీవలి ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అయితే, కోచ్ గంభీర్ కోరుకునే టెక్నిక్, టెంపర్మెంట్ ఈశ్వరన్‌లో ఉన్నాయా? ఈ బెంగాల్ సంచలనానికి హెడ్డింగ్లీ టెస్ట్‌లో అవకాశం ఇవ్వాల్సిందేనని ఎందుకు వాదనలు వినిపిస్తున్నాయో చూద్దాం..
దేశవాళీలో రారాజు
అభిమన్యు ఈశ్వరన్ పేరు వినగానే మొదట గుర్తుకురావాల్సింది అతడి నిలకడమైన ఆటతీరు. అతడి ఫస్ట్-క్లాస్ రికార్డులే ఇందుకు సాక్ష్యం.
- మ్యాచులు: 103
- పరుగులు: 7,841
- సగటు: 48.70
- శతకాలు: 27
- అర్ధశతకాలు: 31
ఈ గణాంకాలు కేవలం అంకెలు కాదు, టెస్ట్ క్రికెట్‌కు కావాల్సిన క్రమశిక్షణ, ఓపిక, పరుగుల దాహం అతనిలో ఎంతగా ఉన్నాయో చెబుతాయి.
ఇంగ్లండ్ గడ్డపై సత్తా..
“దేశవాళీలో ఆడినట్లు విదేశాల్లో ఆడగలడా?” అనే ప్రశ్నకు ఈశ్వరన్ ఇటీవలే సమాధానం చెప్పాడు. ఇండియా-A తరఫున ఇంగ్లండ్‌లో ఆడిన రెండు అనధికారిక టెస్టుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
రెండో ఇన్నింగ్స్‌లలో హీరో: ఒక మ్యాచ్‌లో 68, మరో మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో 80 (92 బంతుల్లో) పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లాండ్‌లోని సీమింగ్ కండిషన్లలో ఆడటానికి కావాల్సిన టెక్నిక్, టెంపర్మెంట్ తనలో ఉన్నాయని నిరూపించుకున్నాడు.
నం.3 స్థానానికి సరైనోడు
కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ టెక్నికల్‌గా పటిష్ఠంగా ఉండే, ఓపికగల ఆటగాళ్లను ఇష్టపడతాడు. ఈశ్వరన్ ఆటతీరు సరిగ్గా గంభీర్ కోరుకునే శైలిలోనే ఉంటుంది. అలాగే, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా, గిల్ నం.4లో వస్తే, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన నం.3 స్థానానికి ఈశ్వరన్ సరైన ఆప్షన్. ఈశ్వరన్‌కు 2021లోనే సీనియర్ జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అనుభవం ఉంది. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ వంటి బౌలర్లను ఎదుర్కోగల సత్తా అతని సొంతం.
‘ఫ్లాషీ’ ఆటగాళ్ల కన్నా అతనే బెటర్
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి దూకుడైన ఆటగాళ్లతో పోలిస్తే, సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు కావాల్సిన లక్షణాలు ఈశ్వరన్‌లో పుష్కలంగా ఉన్నాయి. రెడ్-బాల్ క్రికెట్‌లో అతని నిలకడైన ప్రదర్శనే అతన్ని మిగతా వారి కంటే ముందు నిలుపుతుంది.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
అభిమన్యు ఈశ్వరన్ తన టెస్ట్ క్యాప్‌కు అన్ని విధాలా అర్హుడు. అతని గణాంకాలు, ఇటీవలి ఫామ్, టెక్నిక్, కఠోర శ్రమ అన్నీ గమనిస్తే, ఈ సిరీస్‌లో అతనికి అవకాశం ఇస్తేనే భారత క్రికెట్‌కు న్యాయం చేసినట్లు అవుతుంది. కేవలం స్క్వాడ్‌లో ఉంచడం కాకుండా, తుది జట్టులో అతనికి స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. తుది నిర్ణయం జట్టు యాజమాన్యం చేతిలో ఉన్నప్పటికీ, ఈశ్వరన్ వంటి ఆటగాడిని గుర్తించకపోతే అది భారత క్రికెట్ దురదృష్టమే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.