Rachamallu Siva Prasad Reddy: ఆమెతో ఫొటో దిగితే నేరం చేసినట్టా.. అందుకే విశాఖ రావాల్సివచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే
Rachamallu Siva Prasad Reddy Seek CBI Probe: రసపుత్ర రజనీ దొంగనోట్లతో దొరికింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. డైరెక్టర్ పదవి నుండి తొలగించాం. ఆమె నాతో ఫోటో దిగితే..
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 15, 2023 / 12:57 PM IST
Rachamallu Siva Prasad Reddy Seek CBI Probe: టీడీపీ నేత నారా లోకేష్ మీద పరువునష్టం దావా వేయనున్నట్టు కడపజిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీబీఐను కోరేందుకు విశాఖపట్నం వచ్చినట్టు ఆయన వెల్లడించారు.
“800 కిలోమీటర్లు ప్రయాణించి సీబీఐ ఆఫీసుకు వచ్చాను. టీడీపీ దయవల్ల ఇక్కడకు రావాల్సి వచ్చింది. ఏ ఎమ్మేల్యేకు సీబీఐతో పని ఉండదు. నాపై టీడీపీ చేసిన విష ప్రచారం వల్ల నేను ఇక్కడకు వచ్చాను. నారా లోకేశ్ రెండు సార్లు ప్రొద్దుటూరు వచ్చి నాపై అనేక ఆరోపణలు చేసారు. నేను దొంగనోట్లు వ్యాపారం హుక్కా, జూదం, భూకబ్జా, క్రికెట్ బెట్టింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని టీడీపీ నేతలు నాకు సవాల్ విసిరారు. వారి సవాల్ స్వీకరించి నేను సీబీఐ కార్యలయానికి వచ్చాను, నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సీబీఐ అధికారులను కోరాను.
Also Read: డౌటే లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే.. ఇది పక్కా..
రసపుత్ర రజనీ దొంగనోట్లతో దొరికింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. డైరెక్టర్ పదవి నుంచి తొలగించాం. ఆమె నాతో ఫోటో దిగితే.. నేను ఆమెతో కలసి దొంగనోట్ల వ్యాపారం చేశామని ఆరోపించారు. నాయకులతో అనేక మంది ఫోటోలు దిగుతారు అంతమాత్రాన వారి నేరాలను నాయకులకు అంటగడతారా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసుల్లో స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. వైసీపీ మీద ఎంత విష ప్రచారం చేసిన మీరు అధికారంలోకి రావడం కల్ల” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
