Rain Alert
Rain Alert : తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. ఈ ఏడాది జూన్ నెల నుంచి వరుస తుపానులు ఏపీ, తెలంగాణ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇటీవల మొంథా తుపానుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరో తుపాను దూసుకొస్తుంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
విపత్తుల నిర్వహణ సంస్థ, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశలో కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత 48గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, అది ఏ దిశగా పయణిస్తుందని తెలియాలంటే వాయుగుండంగా ఏర్పడిన తరువాతనే అంచనా వేయడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read : Raithanna Meekosam: ఏపీలో మరో కొత్త కార్యక్రమం.. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రైతన్నా.. మీకోసం..
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో కూడా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గలేదు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.
వచ్చే వారం రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మొంథా తుపాను కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు నష్టపోయారు. ప్రస్తుతం పొలాల్లో మిగిలిన పంట చేతికొస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలు చేతికందే దశలో వర్షం కారణంగా దెబ్బతినకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.