TDP: 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. ఏపీ రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ.. పూర్తి వివరాలు

ఈ క్రమంలో మరో రెండేళ్ల వరకు టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.

TDP

తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.. 41 ఏళ్ల చరిత్రలో ఆ పార్టీకి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఏపీలో రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకోవడంతో.. ఆ మూడు స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో చేరిపోనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఇప్పటికే ఉన్న 8 రాజ్యసభ సీట్లకు అదనంగా మరో మూడు సీట్లు చేరి ఆ పార్టీ సంఖ్యాబలం 11గా మారనుంది. అంతేకాదు.. మరో రెండేళ్ల వరకు పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ రేస్‌ నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా ? లేదా ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతారని ఇన్నాళ్లూ భావించిన టీడీపీ.. వారిపై ఆశలు వదులుకుంది. పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు… రాజ్యసభకు పోటీ చేసే నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ఏపీలోని మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరి.. పెద్దల సభలో వారి సంఖ్యాబలం 11కు మారనుంది.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చడీచప్పుడు లేకుండా పోటీకి దిగి, ఒక స్థానాన్ని గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీకి ప్లాన్‌ చేసిందన్న చర్చ ఇన్నాళ్లూ సాగింది. వైసీపీలో అభ్యర్థుల మార్పు నేపథ్యంలో చాలా మంది అసంతృప్త నేతలుగా మారారు. పైకి కనిపించే వారే 10 మందికిపైగా ఉంటే.. ఇంకా లోలోపల చాలా మంది ఉండొచ్చనే ప్రచారం నడిచింది. ఈ క్రమంలోనే వైసీపీ అసంతృప్త నేతలతో టీడీపీ టచ్‌లోకి వెళ్లడం చర్చనీయాశంగా మారింది.

ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికలు రావడంతో అది టీడీపీకి అనుకూలంగా మారుతుందని అందరూ భావించారు. ఎన్డీయే కూటమిలో చేరే చర్చలు సాగిస్తున్న చంద్రబాబు.. బీజేపీతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేద్దామని భావించారు. ఈ క్రమంలోనే సీఎం రమేశ్‌ను అభ్యర్థిగా నిలుపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఆయన బీజేపీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు పార్టీ పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

మద్దతు కూడగట్టడం కష్టం?
ఈ క్రమంలోనే రాజ్యసభకు నామినేషన్‌ వేసేందుకు అసెంబ్లీ సచివాలయం నుంచి దరఖాస్తు సైతం కొనుగోలు చేశారు టీడీఎల్పీ సిబ్బంది. తమ ఎమ్మెల్యేలతో సంతకాలతో నామినేషన్‌ సిద్ధం చేసి ఉంచారు. గురువారం ఆఖరు కావడంతో ఆరోజు నామినేషన్‌ వేయాలని ముందుగా అనుకున్నారు.

అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంలో అనేక విధాలుగా ఆలోచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో తమ పని సులువుగా కానిచ్చిన టీడీపీ.. రాజ్యసభ ఎన్నికల్లో 25 నుంచి 26 మంది మద్దతు కూటగట్టడం కష్టమనే చర్చ నడిచింది. పైగా సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టడం వల్ల విలువైన సమయం వృథా అవుతుందని పార్టీ నేతలు కూడా సూచించారు.

సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం
దాదాపు 10 రోజులపాటు ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టడంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తేడా జరిగినా అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే అనుమానం టీడీపీలో వ్యక్తమైంది. టీడీపీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ లాంటి నేతలతో బుధవారం సమావేశమైన చంద్రబాబు.. వారి సలహాలు తీసుకున్నారు.

వారందరి సూచన మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ ముగ్గురు అభ్యర్థులకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉన్న వైసీపీకే మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీకి 8 మంది రాజ్యసభ సభ్యులుండగా.. కొత్తగా చేరనున్న ముగ్గురితో కలిపి వీరి సంఖ్య 11కు చేరనుంది. ఈ క్రమంలో మరో రెండేళ్ల వరకు టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.

AP Politics: ప్రైవేటు ఎన్నికలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిర్ణయం

ట్రెండింగ్ వార్తలు