రథసప్తమి వేడుకలు, అరసవిల్లి..నిజరూపంలో దర్శనమిస్తున్న సూర్యభగవానుడు

Arasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి. ప్రభుత్వం తరపున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్‌ సుజాత. స్వామివారిని సతీసమేతంగా దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్‌, ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్‌, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి తదితరులు సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద మహా సరస్వతి. రథసప్తమి తర్వాత కరోనా నుంచి విముక్తి కలగాలని ప్రార్థించానన్నారు.

రథసప్తమి రోజు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానన్నారు డిప్యుటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌,
కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుండే క్యూలో నిలబడ్డారు.

ట్రెండింగ్ వార్తలు