ఏపీలో కరోనా కేసుల వెనక అసలు విషయం బయటపెట్టిన వైద్య ఆరోగ్య కార్యదర్శి

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గణనీయంగా కరోనా కేసుల సంఖ్య తగ్గగా, ఏపీలో మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకిలా అని అంతా ఆశ్చర్యపోయారు. తెలంగాణలో అలా, ఏపీలో ఇలా.. అసలేం జరిగింది అని అంతా చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎక్కువ కరోనా కేసులు ఎందుకు బటయపడుతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో గణనీయంగా కేసులు పెరగడంపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సీఎం జగన్, ప్రభుత్వం, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అన్ని ఎక్కువ కేసులు వస్తాయి:
ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఏపీలో ఎక్కువ కరోనా కేసులు బయటపడటానికి అసలు కారణం ఏంటో ఆయన చెప్పారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అన్ని ఎక్కువ కేసులు వస్తాయని జవహర్ రెడ్డి అన్నారు. అలానే ఏపీలోనూ ఎక్కువ పరీక్షల వల్ల ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. అందులో ఆశ్చర్యపడాల్సిన అంశం ఏదీ లేదన్నారు. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్‌ రేటు తక్కువని జవహర్‌రెడ్డి చెప్పారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1,504 చొప్పున పరీక్షలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలోనే:
‘‘ఇప్పటివరకు 80,334 పరీక్షలు చేశాం, 1,259 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఏపీలో పాజిటివ్‌ కేసులు 1.55శాతం. పాజిటివ్‌ కేసులు ఎక్కువ వచ్చాయని ఆందోళన చెందవద్దు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు(ఏప్రిల్ 28,2020) వచ్చిన 82 కేసుల్లో 75 కేసులు ఓల్డ్‌ క్లస్టర్లలోనే వచ్చాయి. కేవలం ఏడు మాత్రం బయటి ప్రాంతాల్లో వచ్చాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో 9 వైరాలజీ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. త్వరలో మూడు జిల్లాల్లో వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తాం’’ అని జవహర్‌రెడ్డి తెలిపారు.

రాజ్ భవన్ లో నలుగురికి కరోనా పాజిటివ్:
టెలీ మెడిసిన్ అనేది ఏపీలో సత్ఫలితాలు ఇస్తుందని జవహర్ రెడ్డి అన్నారు. స్టేట్ లెవెల్ లో 1170మంది మెడికల్ ఆఫీసర్లను రిక్రూట్ చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే నర్సులను కూడా రిక్రూట్ చేస్తామన్నారు. రాజ్ భవన్ లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమేనని, గవర్నర్ కి కూడా కరోనా టెస్ట్ చేశామన్నారాయన. ఆయనకు నెగిటివ్ వచ్చిందని జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో ఎక్కువ కరోనా కేసులు బయటపడటానికి కారణం ఏంటో జవహర్ రెడ్డి చెప్పేశారు. ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవహర్ రెడ్డి వివరణే సరైన సమాధానంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి దీంతో టీడీపీ నేతలు సంతృప్తి చెందుతారో లేక మరో రూపంలో దాడి చేస్తారో చూడాలి.