town planning లో సంస్కరణలు, అంతా Online లో – బోత్స

  • Publish Date - October 2, 2020 / 12:17 PM IST

Town Planning : టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయబోతున్నట్లు వెల్లడించారాయన. ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే ఉండనున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా నిబంధనల్లో సడలింపులుంటాయన్నారు.

మరింత వేగంగా భవనాలు, లే అవుట్ల అనుమతులు జారీ చేస్తామని, ప్రజా ఉఫయోగ కార్యక్రమాలకు 400 శాతం టీడీఆర్ (TDR) వర్తిస్తుందన్నారు. అనధికార ప్లాట్లు, భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. టౌన్ ప్లానింగ్ (Town Planing) విభాగం పని తీరులో జవాబుదారీతనం పెంచడం వంటి అంశాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సామాన్య ప్రజలు భవన నిర్మాణపు అనుమతులను పొందేట్లుగా చర్యలు తీసుకున్నామన్నారు. పర్యవేక్షక తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించడం తదితర విషయాల్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలతో మూడు ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్లు 178,179,180) జారీ అయ్యాయి.

ఇకపై అక్రమ కట్టడాలు, లే అవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తూ, అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపనున్ననట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అధ్యయనం చేసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి బోత్స తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అన్ని పనులు గడప ముంగిట నుంచే జరిగేలా చూస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేసేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు.