వైసీపీ రీజనల్‌ ఆర్గనైజర్స్‌ నియామకంలో కీలక మార్పులు.. విశాఖకు మళ్లీ విజయసాయి.. సొంత ఇలాఖాలోనే బొత్స

విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు విజయసాయిరెడ్డికి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.

ఓడిపోయాం.. ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి కోలుకుంటున్నాం. ఇంకా అదే డైలమాలో ఉంటే కుదరదు. పార్టీ క్యాడర్‌కు భరోసా ఇవ్వాలి. అందుకే సమన్వయ కర్తలు నియామకం తప్పనిసరని భావించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్. తప్పులను సరిదిద్దుకుని పార్టీ పునర్నిర్మాణం చేపట్టేందుకు కీలక డెసిషన్స్ తీసుకుంటున్నారు.

అందులో భాగంగానే రీజనల్‌ ఆర్గనైజర్స్‌ను నియమించారు. అయితే ఈసారి సమన్వయకర్తల విషయంలో జగన్‌ చాలా కేర్ ఫుల్‌గా స్టెప్‌ వేసినట్లు కనిపిస్తోంది. పవర్‌లో ఉన్నప్పుడు కొందరిని లైట్‌ తీసుకున్న మాజీ సీఎం..ఇప్పుడు మాత్రం అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా..అందరినీ కన్సిడరేషన్‌లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

విశాఖ జిల్లాకు మళ్లీ విజయసాయిరెడ్డినే రీజనల్‌ ఆర్గనైజర్‌గా నియమించారు జగన్‌. గతంలో విశాఖ సమన్వయ కర్తగా ఉన్న విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టాయి. దాంతో వైవీ సుబ్బారెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన నియామకం తర్వాత పెద్దగా మార్పు ఏం లేదని జగన్‌ భావించినట్లు తెలుస్తోంది.

అందుకే తిరిగి విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు?
అందుకే తిరిగి విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. వైవీ సుబ్బారెడ్డిని రాయలసీమకు పంపారు. విశాఖ నుంచి తప్పించడంతో అప్పట్లో అలిగిన విజయసాయిరెడ్డిని బుజ్జగించేందుకే తిరిగి ఆయన కోరుకున్న బాధ్యతలు అప్పగించినట్లు కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఈసారి మూడు జిలాల్లో రెండు మాత్రమే విజయసాయిరెడ్డికి ఇచ్చి..విజయనగరం బాధ్యతలను బొత్సకే వదిలేశారు వైఎస్‌ జగన్.

బొత్స సత్యనారాయణను గోదావరి జిల్లాలకు ఇంచార్జ్‌గా పెట్టారు. గోదావరి జిల్లాకు కాపు ఇమేజ్ ఉన్న లీడర్‌ సమన్వయ కర్తగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం నేతల్లో చాలా కాలంగా ఉంది. దీంతో గోదావరి జిల్లాల నుంచి మిథున్‌రెడ్డిని తప్పించి గుంటూరు, ఒంగోలుకు మార్చారు. ఎన్నికల ముందు మిథున్ రెడ్డిపై గోదావరి జిల్లా నేతలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తులు, గందరగోళం లేకుండా కాపు నేతకే వెస్ట్, ఈస్ట్ గోదావరి బాధ్యతలు అప్పగించారు జగన్.

ఇప్పటికే 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులు
ఆరుగురు పార్టీ సీనియర్లకు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లాకు అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి ఈస్ట్, వెస్ట్ జిల్లాలకు బొత్స సత్యనారాయణను రీజనల్ ఆర్గనైజర్‌గా నియమించారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు విజయసాయిరెడ్డికి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు కొత్త ప్రెసిడెంట్లకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసే అవకాశం ఉంది.

అసంతృప్తులు లేకుండా..అందరినీ స్యాటిస్‌ఫై చేసేలా సమన్వయ కర్తల నియామకం చేశారు జగన్. కానీ వీళ్లంతా సమన్వయంతో పనిచేసి..క్యాడర్‌ భరోసా నింపుతారా లేదా అన్నదే డౌట్‌గా ఉందట. అయితే గతంలో విశాఖ జిల్లా సమన్వయకర్తగా ఉన్న విజయ సాయిరెడ్డితో కొందరు ఎమ్మెల్యేలు గొడవ పడుతుండేవారు. ఆయన ప్రమేయంపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు.

ఇప్పుడు మళ్లీ విజయసాయిరెడ్డే రావడంతో..ఆయనతో సర్దుకుపోయి పనిచేస్తారా లేక.. అపోజిషన్‌లో ఉన్నా సరే ఆయనతో గిట్టదని ముఖం చాటేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. మరికొందరి రీజనల్‌ ఆర్గనైజర్స్‌ విషయంలోనూ కాస్త అసంతృప్తులు ఉన్నట్లే టాక్ వినిపిస్తోంది. అయినా ఇప్పుడైతే ఎన్నికలు లేవు..ఏదైనా ఉంటే రెండేళ్ల తర్వాత చూసుకుందాం అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారట తాజా మాజీ ఎమ్మెల్యేలు.

తెలంగాణలో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. ఇప్పటికే ప్రచారంలో బిజీగా పార్టీలు, అభ్యర్థులు