కోతుల బెడద అంట : ఏపీ భవన్‌లో I Love Amaravathi బోర్డు తొలగింపు

  • Publish Date - January 26, 2020 / 12:40 PM IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. కార్యాలయానికి పక్కనే ఈ బోర్డును ఉంచారు. దీంతో తొలగింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని మారుతున్న కారణంగానే బోర్డును తొలగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు తొలగించారన్న ప్రశ్నలపై అధికారులు అధికారికంగా మీడియాకు వెల్లడించడం లేదు. కానీ కోతులు..బెడద వల్లే ఈ బోర్డును తొలగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. 

గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో బాబు ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బోర్డును తొలగించడం వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. రాజకీయపరంగా విమర్శలు వెల్లువెత్తే అవకాశాలున్నాయి. 
మూడు రాజధానుల ప్రకటన అనంతరం ఏపీలో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకే రాజధాని ఉండాలని అమరావతి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల వైపే మొగ్గు చూపింది. దీనికి సంబంధించిన బిల్లులను కూడా శాసనసభ ఆమోదం పొందింది. కానీ శాసనమండలి విషయానికి వచ్చే సరికి రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను ఆమోదం పొందలేదు.

వీటిని సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలిని రద్దు చేసేందుకు సీఎం జగన్ యోచిస్తున్నారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ప్రత్యేకంగా సమావేశమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. మండలి రద్దుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

* మరోవైపు మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీస్తున్నారు. 
* 2020, జనవరి 25వ తేదీ శనివారం అసెంబ్లీ స్పీకర్..గవర్నర్‌ను కలిసి చర్చించారు. 
* అనంతరం 2020, జనవరి 26వ తేదీ ఆదివారం మండలి ఛైర్మన్..గవర్నర్‌ను కలిశారు. ఎట్ హోం కంటే ముందుగానే ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

* శాసనమండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్ దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది. 
* 2020, జనవరి 27వ తేదీ సోమవారం కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశం జరుగనున్నాయి
* ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అమరావతి బోర్డు తొలగింపుపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Read More : రిపబ్లిక్ డే వేడుకలు..కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

ట్రెండింగ్ వార్తలు