×
Ad

Road Accident : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం.. రెండు లారీలు, ట్రావెల్స్ బస్సు ఢీ..

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సు, రెండు లారీలు ఢీకున్నాయి.

Road Accident

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సు, రెండు లారీలు ఢీకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.. 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు, వెనుక భాగం నుజ్జునుజ్జు అయింది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపెల్లెమెట్ట వద్ద కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి తరువాత 1.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గరైంది. బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో వెనుకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును వెనకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో వెనుకవైపు కూర్చొన్న ఇద్దరు అందులోనే ఇరుక్కొని మరణించారు. ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. వీరిని మూడు 108 వాహనాల్లో ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు ఘటన స్థలికి చేరుకొని బస్సులో వెనుకభాగంలో ఇరుక్కొని మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను బద్రీనాథ్, హరితగా గుర్తించారు.