రుయా ఆస్పత్రి మృతులకు రూ. 10లక్షల పరిహారం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కారణంగా 11 మంది చనిపోగా.. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో ఆలస్యం కారణంగానే ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని అధికారులు చెప్తుండగా.. మరణాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందని, ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం జగన్ చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌ అంశాలపై చర్చించిన జగన్.. ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన చేతుల్లో లేని అంశాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాలేదు. ఆస్పత్రిలో 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారని జగన్‌ చెప్పుకొచ్చారు.

విదేశాల్లో ఆక్సిజన్‌ కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం. ఆక్సిజన్‌ కొరత రాకుండా ఇన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో.. బాధాకర ఘటనలు జరుగుతున్నాయి. కలెక్టర్లు అందరూ అప్రమత్తతతో వ్యవహరించాలి.. మానవత్వం చూపాలి. కొవిడ్‌ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు