తిరుపతిలో రష్యా యువతి లాక్ డౌన్ కష్టాలు..సహాయం చేసిన ఎమ్మెల్యే భూమన

  • Publish Date - July 29, 2020 / 09:06 AM IST

తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చి ఇరుక్కపోయిన రష్యా యువతి అష్టకష్టాలు పడింది. చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండడం, విమానాలు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. స్పందించిన కొందరు సహాయం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమన కరుణకర్ రెడ్డి నగదు సహాయం చేశారు.



రష్యాకు చెందిన ఎస్తర్ ఫిజియోథెరపిస్టు. ఆధ్మాత్మిక చింతన ఎక్కువ. టూరిస్టు వీసాపై 2020, ఫిబ్రవరి 06వ తేదీన తల్లి ఒలివియాతో కలిసి ఇండియాకు చేరుకున్నారు. మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ లోపు దేశంలో కరోనా వ్యాపించడంతో..లాక్ డౌన్ విధించారు. విదేశీ విమానాలు రద్దు కావడం, తిరిగి రష్యాకు వెళ్లకపోవడంతో ఇండియాలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే..వీరు 2020, జులై 19వ తేదీన తిరుపతికి వచ్చారు. కానీ..కోవిడ్ కారణంగా..విదేశీ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం లేదని తెలుసుకుని నిరుత్సాహానికి గురయ్యారు. ఈ దశలో వారి వద్దనున్న డబ్బు అయిపోయింది. తల్లి ఒలివియా రష్యన్లు ఎక్కువగా వచ్చే యూపీలోని బృందావనంకు చేరుకున్నారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.



దీంతో తల్లి యూపీలో, కూతురు తిరుపతిలో చిక్కుకపోయారు. చేతిలో డబ్బు లేకపోవడంతో హోటల్ ఖాళీ చేసి..ఇస్కాన్ ఆశ్రయం కోసం ప్రయత్నించింది. వసతిపై ఆంక్షలు ఉండడంతో వసతి సౌకర్యం కల్పించలేమని, భోజన వసతి మాత్రం కల్పిస్తామని అక్కడున్న వారు చెప్పారు. అలపిరి రోడ్ లో తిరుగుతున్న ఎస్తర్ ను గమనించి…కొంతమంది ఓ రెసిడెన్సీలో వసతి కల్పించారు.

ఎవరైనా సహాయం చేస్తే రష్యాకు వెళ్లిపోతానని వెల్లడించింది. ఆమె కష్టాలు తెలుసుకుని కొంతమంది సహాయం చేశారు. ఎస్తర్ కష్టాలు తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తక్షణం స్పందించారు. పీఏ వెంకటేశ్వర్లును పంపి నగదు సాయం అందించారు.



తన సొంత నిధులతో రష్యాకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. అప్పటి వరకు భోజన వసతి కల్పించడంతో పాటు..తన కోటాలో శ్రీ వారి దర్శనం కల్పిస్తామన్నారు.