Sanitation worker killed by corona vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దఫా పూర్తై, రెండో దఫా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగానే కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది మృతి చెందుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందారు. తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన ఆర్.కృష్ణయ్య (49) పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో టీకా తీసుకున్నాడు. ఆరగంట పాటు ఎలాంటి సమస్య లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు.
బుధవారం తెల్లవారుజామున కళ్లు తిరిగి కిందపడటంతో కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన తండ్రి రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని, ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వేశారని మృతుడు కుమారుడు తిరుమల ఆరోపించారు.
ఈ ఘటనపై జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పెంచలయ్య స్పందించారు. అతను వ్యాక్సిన్ తీసుకున్నది వాస్తవమే అయినా పోస్టుమార్టం రిపోర్టుతోనే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. ప్రభుత్వానికి రిపోర్టు చేస్తామని చెప్పారు. కృష్ణయ్య రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
నిన్న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఓ అంగన్ వాడీ టీచర్ మరణించారు. నందిపాడులో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 4 రోజుల తర్వాత అంగన్ వాడీ టీచర్ మృతి చెందారు. అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్న నాగమణి అనే మహిళ నాలుగు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో కరోనా వ్యాక్సిన్ పై భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు.