అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నాను: కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌

తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.

Sanjeev Kumar

Sanjeev Kumar: వైసీపీ తీరుపై ఆ పార్టీ నేత, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మండిపడ్డారు. అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు.

నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించే అవకాశం వచ్చిందని సంజీవ్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేలు చూసుకుంటారని ఆయన చెప్పారని అన్నారు.

పార్లమెంట్ సభ్యుడిగా తన పరిధిలో తాను చేయగలిగిన కార్యక్రమాలు చేశానని సంజీవ్ కుమార్ చెప్పారు. కానీ అనుకున్నన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయానని అన్నారు. తనకు ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఉందో లేదో తెలియదని చెప్పారు. వేరే వ్యక్తికి టికెట్ ఇస్తారని తెలిసిందని అన్నారు.

భవిష్యత్ కార్యాచరణపై..

పార్టీ నుంచి తనకు ఎలాంటి నేరుగా సంకేతాలు ఇవ్వలేదని సంజీవ్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, సన్నిహితులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను వృత్తిరీత్యా డాక్టర్‌నని అన్నారు. 25 వేల ఆపరేషన్ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన డాక్టర్‌నని చెప్పారు.

రాబోయే రోజుల్లో డాక్టర్‌గా ఉండాలా? ప్రజాప్రతినిధిగా ఉండాలా? అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. నియోజకవర్గ ప్రజల అభిమానం మేరకే తాను నడుచుకుంటానని చెప్పారు. తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.

వారితో కలిసి వెళ్లి.. సీఎం జగన్‌తో ఎంపీ కేశినేని నాని భేటీ