సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా ఉన్నామంటూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రోడ్డు మీదకు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే జనాలను తరలిస్తున్నాయి. అయితే..నిబంధనలకు విరుద్ధంగా..ఎలాంటి పత్రాలు లేకుండా..అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
వీరిపై కొరఢా ఝులిపించింది. నిబంధనలు పాటించని బస్సులపై ఏకంగా కేసులు నమోదు చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు కలవరపాటుకు గురవుతున్నారు. సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున డబ్బులు డండుకుంటున్నారు. దీంతో మంత్రి పేర్ని నాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆదేశాలు అందుకోవడమే తరువాయి…RTA అధికారులు రంగంలోకి దిగి..రాత్రి వేళ తనిఖీలు నిర్వహించారు. 2020, జనవరి 07వ తేదీ మంగళవారం ఒక్కరోజే 73 బస్సులను సీజ్ చేసింది. మరో 45 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్, కావేరి, భవాని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. రెడ్ బస్, అభి బస్ యాజమాన్యాలకు మోటార్ వెహికల్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు అధికారులు.
2020, జనవరి 08వ తేదీ బుధవారం 56 బస్సుపై కేసులు, మంగళవారం 73 బస్సులు సీజ్ అవ్వడంతో… పత్రాలు లేకుండా విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచుతూ తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వణికిపోతున్నాయి. బస్సులను రోడ్డు మీదకు తీయాలంటే జంకుతున్నారు. కనకదుర్గమ్మ వారధి, గరికపాడు చెక్‌పోస్టు, పొట్టిపాడు టోల్‌ప్లాజా, కేసర టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేశారు. మరి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు మారుతాయా ? లేదా అనేది చూడాలి.
Read More : రాజధాని రగడ 22వ రోజు : టెంట్ వేస్తే..అడ్డుకున్న కాప్స్