Ap Schools Reopen
AP Schools Reopen : కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్టు 16, 2021) నుంచి రాష్ట్రంలో పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
కాగా, తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలంది.
విద్యారంగంలో సమూల మార్పుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు నేడు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ‘జగనన్న విద్యాకానుక’ను ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక అందించనున్నారు. మొత్తం 47.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు. గతేడాది విద్యాకానుక కింద 42.34 లక్షల మంది విద్యార్థులకు కిట్స్ అందించారు.