వచ్చే ఏడాది నుంచి ఏపీ Govt పాఠశాలల్లో LKG, UKG విద్య

  • Publish Date - July 22, 2020 / 01:16 PM IST

విద్యారంగంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే…. మరోవైపు పోటీ పరీక్షలకు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ట్రైనింగ్‌ ఇవ్వడంలాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా… రాబోయే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించనుంది.

దీంతో ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్‌ స్కూల్స్‌తో పోటీపడనున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం చదువు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల విద్య పరిధిలోకి పీపీ1, పీపీ2 ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం జగన్‌ ముందు పెట్టింది. ఈ ఏడాది నుంచే కిండర్‌ గార్డన్‌ను ప్రారంభించనుంది. స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, జేఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా కార్పొరేట్ కాలేజిలకు ప్రభుత్వ ఇంటర్ మీడియట్ కాలేజిలను పోటీగా నడపనుంది. ఏపీలో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చాలనే లక్ష్యంతో జిల్లాకో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు.. ప్రతి మండలంలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి పాఠశాలల పున: ప్రారంభిచాలని నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రి ప్రైమరీ ఎడ్యూకేషన్…ఎల్ కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనుంది ప్రభుత్వం. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ కేజీ, యూకేజీ బోధనలు సాగుతున్నాయి. వాటిలో 11,657 అంగన్వాడీ కేంద్రాలు పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, భవనాలకు అనుకుని ఉన్నాయి.

ఈ అంగన్వాడీ కేంద్రాలను ఆయా ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి విద్యా బోధన సాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రీ ప్రైమరీ ఎడ్యూకేషన్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.