వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా (RBK) కేంద్రాలను మే 30, 2020న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్‌లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ (RBK) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ ‘కియోస్క్’లను అమర్చనున్నారు. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’లు మాదిరిగానే ఈ ‘కియోస్క్’లు పనిచేయనున్నాయి.
ఈ డిజిటల్ కియోస్క్ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధర్మల్ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్‌పుట్, యూఎస్‌బీ చార్జింగ్ స్లాట్, ఏ-4 కలర్ ప్రింటర్, ఈ-పాస్ మిషన్, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్ రీడర్‌నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను లింక్ చేశారు.
రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కియోస్క్ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకాలి. ఫోన్ నంబరును ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వాటి బొమ్మలు, ధరలు కియోస్క్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. రైతు కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లిక్ చేస్తే ఆర్డరు రెడీ అవుతుంది. సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి ‘హబ్’(గోదాము)కు సరుకుల ఆర్డర్ వెళ్తుంది. కియోస్క్ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి.
ఆర్‌బీకేలోని అగ్రీ ఇన్‌పుట్ షాపు ఈ మోడల్‌లో పని చేస్తుంది. నిల్వ, ఇన్వెంటరీ, అమ్మకం, రాబడుల నిర్వహణ, సరకు రవాణా తదితరాలకు హాబ్‌లు గిడ్డంగులుగా ఉంటాయి. వర్చువల్ రిటైల్ స్టోర్లుగా స్పోక్స్ పని చేస్తాయి. రైతులు తమ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రతి ఆర్‌బీకేలో డిజిటల్ విధానంలో ఏర్పాటు చేసే కియోస్కే ఈ స్పోక్‌గా పిలుస్తారు. కియోస్క్ మెషిన్ ఏటీఎం మాదిరిగా ఉంటుంది. రైతులు తమ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాల(ఇన్‌పుట్స్)ను ఆర్డరు చేస్తే.. 48 నుంచి 72 గంటల (2 నుంచి 3 రోజుల)లోగా బట్వాడా చేస్తారు. కియోస్క్ ద్వారా విత్తనాలు తదితరాలను ఎంపిక చేసుకోవడం, ఆర్డర్ చేయడం వంటి విషయాలలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
Read: విశాఖలో ఒకేరోజు పది మందికి కరోనా పాజిటివ్