గుంటూరులో యువతిపై లైంగికదాడి, న్యూడ్ ఫోటోలు పోస్టింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్న మరో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ కేసులో వరుణ్, కేశవ్, ధనుంజయ్‌రెడ్డి, మణికంఠలను ప్రధాన నిందితులు కాగా.. నిందితుల్లో ధనుంజయరెడ్డి, తులసి రెడ్డికి గతంలో నేర స్వభావం ఉంది. అరెస్టు చేసిన ఏడుగురినీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి సహ విద్యార్థినిని మోసం చేశాడు. ఆమె న్యూడ్ వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు తోటి విద్యార్థులకు వీడియోలను పంపాడు.
రెండో నిందితుడైన కౌశిక్ ఆ విద్యార్థిని న్యూడ్ ఫోటోలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరుకున్నాయి. వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు.
వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి రూ.50 వేల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపమని కోరగా.. నిందితులు దొరికిపోతామనే భయంతో అకౌంట్ నంబర్ ఇవ్వలేదు.
ఈ క్రమంలో యువతే ధైర్యం చేసి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు.
Read Here>>ఆగష్టు 15కల్లా ఇంటి పట్టాలు ఇచ్చి తీరాలనేదే సీఎం జగన్ కోరిక