వరల్డ్ ఛాంపియన్ సింధుని సత్కరించిన సీఎం జగన్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,2019న స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్  వీరోచితంగా పోరాడి  వరల్డ్ బ్యాడ్మింట్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన సింధుని సీఎం ప్రశంసించారు. ఆమెను శాలువా కప్పి సత్కరించారు.

సింధుకి సీఎం జ్ణాపికను బహుకరించారు.  తనకు దక్కిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు చూపిస్తూ సింధు మురిసిపోయారు. అనంతరం ఒక బ్యాడ్మింటన్ బ్యాటును సీఎంకు బహుకరించారు. భవిష్యత్తులో మరింత మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. అంతకుముందు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ సింధుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు.