Ys Sharmila: సింగయ్య మృతి ఘటన వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బల ప్రదర్శన కోసమే జగన్ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేసే ప్రతి పర్యటనలో బల నిరూపణ కోసం జన సమీకరణ చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. బల ప్రదర్శన యాత్రల వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే జగన్ పర్యటనలను ఈ ప్రభుత్వం నిషేధించాలని షర్మిల డిమాండ్ చేశారు.
సింగయ్య మృతి ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందన్నారు షర్మిల. కారు సైడ్ బోర్డు పై జగన్ నిలబడటం వల్ల జనం షేక్ హ్యాండ్ ల కోసం ఎగబడ్డారని, దాంతో ప్రమాదం జరిగిందని షర్మిల చెప్పారు. తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్ ప్రవర్తించారని షర్మిల ధ్వజమెత్తారు.
”ఈ మధ్య జగన్ ఏ యాత్ర చేసినా జన సమీకరణ కోసం, బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు కూడా బయటికి వచ్చింది లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు, కనీసం కనుకున్నది కూడా లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేశారు. అయినా ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ బయటికి రాలేదు. ప్రజల దగ్గరికి కాదు కదా.. కనీసం వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గరికి కూడా జగన్ ఎప్పుడూ వెళ్లలేదు. అసలు వాళ్లకు కూడా అపాయింట్ మెంట్లు లేవు. ఇప్పుడు జగన్ 2.O గురించి మాట్లాడుతున్నారు. 1.O ని నాశనం చేసిన తర్వాత.
వాళ్ల కార్యకర్తల్లో నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయనకు బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తున్నారు. తాను పెద్ద నాయకుడు అనే అభిప్రాయం కలిగించడానికే ఈ ప్రయత్నం అంతా. బల ప్రదర్శనంతా దీని కోసమే. అక్కడ ఇష్యూ ఉన్న లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తోంది. ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి జగన్ ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధించాలి” అని షర్మిల అన్నారు.
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు షర్మిల. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిందని, చంద్రబాబు ప్రజలను ముంచారని అనుకుంటున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో అల్లాడుతున్నారని వాపోయారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయటం లేదన్నారు షర్మిల.
Also Read: ఆ భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటాం.. ఫిక్కీ సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
”అన్నదాత సుఖీభవ లబ్దిదారులు 75 లక్షలు ఉంటే 65 లక్షలే అంటున్నారు. ఉచిత బస్సు పథకాన్ని పొడిగిస్తూ ప్రజలను ఊరిస్తున్నారు. ఎన్నికలకు ముందు పీ4 పథకం అమలు చేస్తామని చెప్పలేదు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తామని పట్టించుకోవటం లేదు.
ఫీజు రీయింబర్స్ మెంట్ 4300 కోట్లు బకాయిలు ఉంటే ఇంతవరకు ఎందుకు ఇవ్వటం లేదు? బీజేపీకి కూటమి నేతలు తొత్తులుగా మారారు. బీజేపీ విభజన హామీలను నెరవేర్చ లేదు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని షర్మిల అన్నారు.